విదేశాల్లో చదువుతోపాటు ఉద్యోగ ప్రణాళికలు! 17 d ago
విదేశాల్లో చదువుల కోసం వెళ్లే విద్యార్ధులు అక్కడ వారి కనీస అవసరాల కోసం పార్ట్‌టైమ్ ఉద్యోగాల మీద ఆధారపడుతున్న సందర్భాలు చాలా ఉంటున్నాయి. అయితే రకరకాల కారణాల వల్ల గతంలో కంటే ఇప్పుడు వీటి లభ్యత తగ్గిందని చెప్పొచ్చు. వెళ్లే ముందు ఏ దేశంలో ఎలాంటి పరిస్థితి ఉందో తెలుసుకుంటే విద్యార్ధులు ప్రణాళికను సిద్ధం చేసుకోవడం సులభం అవుతుంది!
అమెరికా యూఎస్‌సీఐస్ నిబంధనల ప్రకారం ఇతర దేశాల నుండి వచ్చే విద్యార్థులు ఆఫ్ క్యాంపస్‌లో పని చేయడానికి కుదరదు. కానీ ఆన్ క్యాంపస్‌లో వారానికి 20 గంటల వరకూ పనిచేయోచ్చు.
దీనికోసం క్రింది నిబంధనలు పాటించాలి.
ఏదేని యూనివర్సిటీలో ఫుల్ టైమ్ విద్యార్ధిగా చేరాలి.
ఎఫ్ 1 స్టేటస్ మనుగడలో ఉండాలి.
కాలేజీ జరుగుతున్న రోజుల్లో వారానికి 20 గంటలు మాత్రమే పనిచేయవచ్చు. సెలవు రోజుల్లో ఫుల్‌టైమ్ జాబ్ చేయవచ్చు.
యూనివర్సిటీలో ఉన్న ఇంటర్నేషనల్ స్టూడెంట్ ఆఫీస్ వద్ద వర్క్ పర్మిట్ కోసం దరఖాస్తు చేసుకోవాలి.
చదువు పూర్తయిన తర్వాత... సీపీటీ లేదా ఓపీటీ రూపంలో యూఎస్‌సీఐఎస్ అనుమతి తీసుకున్న తర్వాత ఆఫ్ క్యాంపస్‌లో పూర్తిస్ధాయిలో పనిచేయవచ్చు. ఓపీటీ (ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రెయినింగ్), సీపీటీ (కరిక్యులర్ ప్రాక్టికల్ ట్రెయినింగ్), ద్వారా వారానికి 40 గంటలు పనిచేసే వీలుంటుంది. దీనికి కూడా చాలా నిబంధనలు ఉన్నాయి.
స్టూడెంట్ మేజర్ సబ్జెక్ట్‌కు చేసే పని నేరుగా సంబందించింది అయ్యిండాలి. ఎఫ్ 1స్టేటస్‌ను చట్టబద్దంగా కలిగి ఉండాలి. డిగ్రీ సంబంధిత పని మొత్తం పూర్తయ్యాకే విద్యార్ధి ఓపీటీకి దరఖాస్తు చేయాలి.
12 నెలల వ్యవధి కంటే ఎక్కువ సీపీటీలో ఉన్న విద్యార్ధులు ఓపీటీకి అనర్హులు.స్టెమ్ సంబంధిత కోర్సులు చేసిన విద్యార్థులకు ఓపీటీ 12 నెలల కాలానికి ఇస్తారు. దీని పొడిగింపు కోసం కాల వ్యవధి ముగియక ముందే దరఖాస్తు చేసుకోవాలి. దీన్ని గరిష్ఠంగా 24 నెలలకు పొందవచ్చు. ఈ మొత్తం సమయంలో విద్యార్థి తన గురించి ప్రతి 3 నెలలకు ఒకసారి యూనివర్సిటీకి సమాచారం తెలియజేస్తూ ఉండాలి.